పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది! 

(5 వ భాగము) ఈనాడు సౌజన్యం తో


యుద్ధరంగంలో ఉన్న సైనికులకు వాళ్ల పై అధికారి ఏమని చెబుతాడు?

శత్రుసైన్యం మనకన్నా పెద్దది, మనం ఎంత పోరాడినా వృథానే... 

అని చెప్పరు కదా? 'పదండి, ముందుకు దూకండి. మీ శక్తి ముందు శత్రుసైన్యం బలాదూర్‌. 

విజయం మనదే' లాంటి మాటలతో వాళ్లకి ప్రేరణ కలిగిస్తాడు. అవి వారి శక్తిసామర్థ్యాలను

రెట్టింపు చేస్తాయి. పిల్లలు ఒకసారి పరీక్ష తప్పితే 'నీవల్ల కాదులే, మానేసెయ్‌' అనరుగా.

'పర్వాలేదు. ఎక్కడో పొరపాటు జరిగివుంటుంది. నువ్వు బాగా చదువుతావు. 

ఈసారి తప్పకుండా పాసవుతావు' అని ప్రోత్సహిస్తారు.


నిజమే కానీ ఒకోసారి- మన పొట్టలో నొప్పి తీవ్రంగా ఉండవచ్చు, సైన్యం ఓడిపోయే

యుద్ధమే చేస్తుండవచ్చు, పిల్లవాడిలో పరీక్ష ఎదుర్కొనే సత్తా లేకపోవచ్చు. 

అటువంటప్పుడు అబద్ధమెలా చెబుతాము... అనిపిస్తుంది. అక్కడే ఉంది అసలు

విషయమంతా. చెవిటి కప్ప కథ గుర్తుందా?


బావిలోనుంచి బయటకు రావడానికి ప్రయత్నించి కొన్ని కప్పలు చతికిలబడతాయి.

అవి ఊరుకోకుండా మిగతా వాటిని కూడా మనవల్ల కాదులే అంటూ ఊదరగొడతాయి.

దాంతో మిగిలినవీ ప్రయత్నాన్ని విరమించుకుంటాయి.ఈ గొడవేమీ విన్ఫించని

చెవిటి కప్ప మాత్రం ఎగురుతూనే ఉంటుంది. చివరికి బయటపడుతుంది. 

మనవల్ల కాదు అన్నమాట వినబడకపోవడంవల్లే అది గెలుస్తుంది. ఈ విషయంమీద

డాక్టర్‌ మసారు ఎమోటో అనే శాస్త్రవేత్త ఓ పరిశోధన చేశారు. మనిషి శరీరంలో అరవైశాతం

దాకా నీళ్లే ఉంటాయి కాబట్టి నీటితోనే ఆయన ఈ ప్రయోగం చేశారు. రెండు వేర్వేరు

పాత్రల్లో నీరు తీసుకుని ఒకదానికి రోజూ చెడు మాటలూ తిట్లూ వినిపించేవారు.

ఇంకో దానికి ప్రోత్సాహకరమైన, ప్రేమపూర్వకమైన మాటలూ పాటలూ విన్పించారు.

కొన్నాళ్ల తర్వాత ఆ నీటిని గడ్డకట్టేలా చేసి కణాలను సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే

మంచి మాటలు విన్న పాత్రలో నీటి కణాలు అందంగా, ఆర్గనైజ్డ్‌ రూపాల్లో ఏర్పడగా,

తిట్లూ శాపనార్థాలూ విన్న పాత్రలోని నీటి కణాలు ఒక ఆకృతి అంటూ లేకుండా

వికారంగా తయారయ్యాయట.


అందుకే శరీరంలోని కణాలకు కూడా మంచి సూచనలు ఇవ్వండి,ప్రోత్సహించండి,

లబ్ధిపొందండి... అంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలోని ఏ అవయవంలోనైనా

సమస్య ఉందనిపిస్తే దాన్ని మరమ్మతు చేయమని అక్కడి కణాలకు సూచనలు

ఇవ్వవచ్చు. స్నేహితుడితో మాట్లాడినట్లే మీ శరీరంతో మాట్లాడండి. 

మెదడు, కాలేయం, గుండె... ఇలా ఆయా అవయవాల పనితీరుకు తగినట్లు అక్కడి

కణాలుంటాయి. అవన్నీ కూడా మనం ఇచ్చే ఆజ్ఞ శిరసావహించడానికి సిద్ధంగా ఉంటాయి.

కాబట్టి వాటికి సానుకూలమైన ఆలోచనల్ని చేరవేయండి. కణాల ఆరోగ్యానికి మంచి ఆహారం

ఎంత అవసరమో అవి చురుగ్గా పనిచేయడానికి మంచి ఆలోచనలూ అంతే అవసరం.

 

No comments:

Post a Comment