పాజిటివ్ మాట్లాడండి... ప్రతి అణువూ వింటుంది!
(7 వ భాగము) ఈనాడు సౌజన్యం తో
కొందరికి శరీరంలో ఏదో ఒక భాగం బలహీనంగా ఉండవచ్చు. దానివల్లే తరచూ అనారోగ్యం
తలెత్తుతుండవచ్చు. అటువంటప్పుడు ఆ భాగంతో తరచూ మాట్లాడాలి. అజీర్తి సమస్యే
ఉంటే కడుపుకి చెప్పండి. "ఈరోజు నేను నిన్ను నొప్పించను. నీకు తేలిగ్గా ఉండే ఆహారమే
తీసుకుంటాను. ప్రశాంతంగా నీ పనిచేసుకో...” అని చెప్పండి. ఎప్పుడైతే మన శరీరంలోని
అవయవం మీద దృష్టిపెట్టి మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు నిజంగానే వాటిని మనం
ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధమవుతుంది. ఆఫీసులో రోజూ రెండు గంటలు
ఎక్కువసేపు పనిచేయండి అంటే మీరు ఇష్టంగా చేస్తారా? రూల్స్ మాట్లాడతారు,
ఎక్కువ జీతం ఇవ్వమంటారు. మరి మన అవయవమూ అంతే కదా, అది పనిచేయడానికి
ఒక పద్ధతీ సమయమూ ఉంటాయి. అవేవీ పట్టించుకోకుండా మనకి నచ్చిన పదార్థాలని,
నచ్చిన సమయంలో నచ్చిన మోతాదులో తినేస్తే అదెలా తట్టుకోగలుగుతుంది?
ఈ అవగాహన వస్తే ఆహారపుటలవాట్ల మీద నియంత్రణ పాటించగలుగుతాం.
పొట్ట కణాల్ని సుఖపెట్టగలుగుతాం. అలాగే ఇతర అవయవాలూ అలవాట్లూ కూడా.
మన శ్రేయస్సు కోరి నిస్వార్ధంగా పనిచేసి పెట్టేవాళ్లు దొరకడం ఎంత కష్టం ఈరోజుల్లో.
అలాంటిది... బతిమిలాడకుండా, డబ్బుతో పనిలేకుండా కోట్ల కోట్ల కణాలు మనకి సేవ
చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చేయాల్సిందల్లా సానుకూల సంకేతాలు పంపడమే...
మరెందుకాలస్యం...
ఇళ్లలో మనకి పనిచేసి పెట్టే పరికరాలు చాలానే ఉంటాయి. వాటిని ఎలా వాడతారు?
వాషింగ్‌మిషన్ పట్టనన్ని బట్టల్ని కుక్కితే అది తిరగనని మొరాయిస్తుంది. సరిగ్గా వాడకపోతే
ఫ్రిజ్ పనిచేయడం మానేస్తుంది. అందుకని వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం.
మరి అంత జాగ్రత్త శరీరం పట్ల తీసుకుంటున్నామా...? డబ్బు పెట్టి కొనుక్కునే పరికరాలు
పాడైపోతే కొత్తవి దొరుకుతాయి కానీ అవయవాల్ని కొనలేం. అందుకే ఆయా అవయవాలు
సరిగ్గా పనిచేయాలంటే వాటి కణజాలం ఆరోగ్యంగా ఉండాలి. కానీ కణాల ఆరోగ్యాన్ని
దెబ్బతీస్తున్నది మన అలవాట్లే. ఒత్తిడీ, ఆందోళనా మొత్తంగా శరీరంలోని కణాలన్నిటినీ
కుంచించుకుపోయేలా చేస్తాయి. వేళ తప్పి తీసుకునే ఆహారమూ, అతిగా తీసుకునే
శీతలపానీయాలూ, కాఫీలూ, టీలూ, తరచూ చేసే మద్యపానమూ మొత్తంగా జీర్ణవ్యవస్థా,
కాలేయాలలోని కణజాలాన్ని దెబ్బతీస్తాయి.
తగినంత శారీరక వ్యాయామం లేకపోయినా, అతిగా చేసినా... కీళ్లూ కండరాల్లోని కణాలు
చాలినంత విశ్రాంతీ నిద్రా లేకపోతే మెదడు కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. సిగరెట్ పొగా,
కాలుష్యమూ ఊపిరితిత్తుల కణజాలానికి శ్వాస ఆడనివ్వవు. యాంటిబయోటిక్స్ లాంటివి అతిగా
వాడినా మొదట చెడిపోయేది కణజాలమే.
మనం ఇచ్చే సూచనలు కణాలు విన్నట్లే వాటి నుంచి వచ్చే సూచనలని మనమూ వినొచ్చు.
ధ్యానం గురించి చెప్పేవారంతా "మీలోపలికి మీరు చూసుకోండి. శ్వాస మీదా, అవయవాల మీదా
ధ్యాస పెట్టండి" అని చెప్పడంలో అర్థం అదే. మన మాటలు శరీరం విన్నంతగా శరీరం చెప్పేది
మనం వినడం లేదు. తలనొప్పిగా ఉంటే ఒక మాత్ర వేసుకుని పనిచేసుకుంటాం.
ఒళ్లు వెచ్చబడితే ఇంకో మాత్ర, ఆవలింతలు వస్తుంటే నిద్ర వస్తోందనుకుని చల్లటి నీళ్లతో
ముఖం కడుక్కొచ్చి మళ్లీ పని లేదా టీవీ చూడడంలో మునిగిపోతాం. అంతేకానీ దానికి కారణం
ఏమై ఉంటుందన్న ఆలోచనే రాదు. శరీరానికి చాలినంత నీరు అందకపోయినా, అజీర్తి చేసినా
తలనొప్పి వస్తుంది. తలనొప్పికి సవాలక్ష కారణాలుంటాయి. మనం వేసుకునే మాత్ర తలనొప్పిని
తగ్గిస్తుంది కానీ దానికి కారణమైన సమస్య అలాగే ఉంటుంది. మామూలు జ్వరం రెండు రోజులు
విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మాత్రలు మింగేస్తాం.
మెదడుకి ఆక్సిజన్ తక్కువైనా, ఉష్ణోగ్రత ఎక్కువైనా ఆవలింతలు వస్తాయి. ఉన్నచోటు నుంచి
లేచి, కాస్త తాజా గాలిని పీల్చుకుంటే సర్దుకుంటుంది. కానీ మనం మాత్రం సోఫాలోంచి కదలం.
ఇలాంటివే ఇంకా ఎన్నో సంకేతాలను శరీరం మనకు పంపిస్తూ ఉంటుంది. వాటిని అర్ధం చేసుకుని
తగిన చర్య తీసుకోగలిగితే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే. అందుకే మరి, శరీరం చెప్పేది
వినమనేది!
🙏🙏🙏సమాప్తం🙏🙏🙏
No comments:
Post a Comment