డయాబెటిస్(చక్కెర వ్యాధి/షుగర్)
డయాబెటిస్ అంటే ఏమిటి?
సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్ (చక్కెర) రూపంలో రక్తంలోకి చేరుతుంది. ఈ
గ్లూకోజ్ మన శరీరంలోని కణాలకు చేరి శక్తిని ఇవ్వాలి. దీనికోసం క్లోమ గ్రంథి (Pancreas) ఇన్సులిన్
అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ ఒక 'తాళం చెవి' లాగా పనిచేసి, రక్తంలోని చక్కెర
కణాల్లోకి వెళ్లేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు లేదా
ఉత్పత్తి అయినా శరీరం దానిని వాడుకోలేదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
డయాబెటిస్ రకాలు
టైప్-1 డయాబెటిస్: శరీరంలో ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాదు. ఇది ఎక్కువగా పిల్లల్లో లేదా
చిన్న వయసు వారిలో కనిపిస్తుంది. వీరు ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
టైప్-2 డయాబెటిస్: శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేదు లేదా తగినంత ఇన్సులిన్
ఉత్పత్తి కాదు. ఇది ఎక్కువగా పెద్దవారిలో, జీవనశైలి సరిగ్గా లేనివారిలో వస్తుంది. 90%
మందికి ఇదే రకం ఉంటుంది.
గర్భధారణ డయాబెటిస్ (Gestational Diabetes): కొంతమంది మహిళలకు గర్భవతిగా
ఉన్నసమయంలో వస్తుంది.
ముఖ్యమైన లక్షణాలు:
అతిగా దాహం వేయడం.
తరచుగా మూత్ర విసర్జన రావడం (ముఖ్యంగా రాత్రిపూట).
ఎంత తిన్నా ఆకలిగా అనిపించడం.
అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.
అలసట, నీరసంగా ఉండటం.
కంటి చూపు మసకబారడం.
గాయాలు త్వరగా మానకపోవడం.
కారణాలు
వంశపారంపర్యం : కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంది.
అధిక బరువు: శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం.
ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్, శీతల పానీయాలు, ఎక్కువ తీపి పదార్థాలు
తీసుకోవడం.
ఒత్తిడి: మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం
హడావిడిగా ఆహారం తీసుకోవడం: ఆహారమును నమాలకుండా తీసుకోవడం వలన
ఆహారంతో లాలాజలం సరిగా కలవక షుగర్ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ (Insulin Resistance) అంటే ఏమిటి?
టైప్-2 డయాబెటిస్‌లో ప్రధాన సమస్య ఇది.
సాధారణ పరిస్థితి: మీ కణాల మీద ఒక 'తలుపు' ఉంటుందని ఊహించుకోండి. ఇన్సులిన్ వచ్చి
ఆ తలుపును తెరిస్తేనే రక్తంలోని గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది.
రెసిస్టెన్స్ : మీరు వ్యాయామం చేయకపోయినా లేదా అధిక బరువు ఉన్నా, మీ కణాలు
ఇన్సులిన్‌కు స్పందించవు (అంటే తలుపులు మొరాయిస్తాయి). అప్పుడు క్లోమగ్రంథి (Pancreas)
ఇంకా ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫలితం : కొంతకాలం తర్వాత క్లోమగ్రంథి అలసిపోయి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది.
అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి.
చక్కెర స్థాయి పెరిగితే శరీరానికి ఎందుకు ప్రమాదం?
రక్తంలో చక్కెర పెరిగితే అది సిరప్ (పాకం) లాగా మారుతుంది. దీనివల్ల రెండు ప్రధాన నష్టాలు
జరుగుతాయి
సూక్ష్మ రక్తనాళాల దెబ్బతినడం (Microvascular Damage): కళ్ళు (Retina), కిడ్నీలు (Nephrons),
మరియు శరీరంలోని నరాలు (Nerves) చాలా సున్నితమైన రక్తనాళాలను కలిగి ఉంటాయి. చక్కెర
ఎక్కువగా ఉన్న రక్తం వీటి గుండా ప్రవహించినప్పుడు, ఆ నాళాలు చిట్లిపోవడం లేదా
మూసుకుపోవడం జరుగుతుంది. అందుకే డయాబెటిస్ వస్తే చూపు మందగించడం, కాళ్ల తిమ్మిర్లు
వస్తాయి.
శరీరంలో మంట Inflammation: రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే శరీరంలో మంట
(Inflammation) పెరుగుతుంది. ఇది గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది, దీనివల్ల
హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
HbA1c పరీక్ష అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం?
చాలామంది కేవలం పరగడుపున (Fasting) చేసే పరీక్షనే నమ్ముతారు. కానీ HbA1c అనేది అసలైన
పరీక్ష. మన రక్తంలోని ఎర్ర రక్త కణాలు (RBC) సుమారు 120 రోజులు బతుకుతాయి. ఈ కణాలకు
చక్కెర ఎంతవరకు అంటుకుందో ఈ పరీక్ష చెబుతుంది. అంటే గత 3 నెలల సగటు షుగర్ లెవల్స్
ఎలా ఉన్నాయో ఇది నిర్ధారిస్తుంది. HbA1c 5.7% లోపు ఉంటే నార్మల్, 6.5% పైన ఉంటే యాబెటిస్
ఉన్నట్లు లెక్క.
డయాబెటిస్ మరియు ఇతర అవయవాల సంబంధం
కిడ్నీలు: రక్తాన్ని వడకట్టే క్రమంలో కిడ్నీలు ఎక్కువ చక్కెరను బయటకు పంపడానికి
ప్రయత్నించి తీవ్రంగా శ్రమిస్తాయి. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది.
పాదాలు (Diabetic Foot): నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు గాయమైనా నొప్పి తెలియదు.
రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ గాయం త్వరగా మానదు. అందుకే చిన్న పుండు
కూడా గ్యాంగ్రీన్ (కుళ్లిపోవడం) లా మారుతుంది.
మనం మార్చుకోవాల్సిన 'గ్లైసెమిక్ ఇండెక్స్' (GI)
మనం తినే ఆహారం ఎంత వేగంగా రక్తంలో షుగర్‌ను పెంచుతుందో చెప్పేదే GI.
High GI: తెల్లటి అన్నం, మైదా, పంచదార, బంగాళదుంప (ఇవి తిన్న వెంటనే షుగర్ లెవల్స్
రాకెట్‌లా పైకి వెళ్తాయి).
Low GI: రాగులు, జొన్నలు, సజ్జలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు (ఇవి తింటే షుగర్ నెమ్మదిగా
రక్తంలోకి విడుదలవుతుంది, దీనివల్ల ఇన్సులిన్‌పై ఒత్తిడి పడదు).
No comments:
Post a Comment